నేడు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ రాక‌.. న‌గ‌రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

PM Narendra Modi to visit Hyderabad Today.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేడు(గురువారం) హైద‌రాబాద్‌కు రానున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 3:44 AM GMT
నేడు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ రాక‌.. న‌గ‌రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేడు(గురువారం) హైద‌రాబాద్‌కు రానున్నారు. గ‌చ్చిబౌలిలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌(ఐఎస్‌బీ) 20వ వార్షికోవ‌త్సంతో పాటు స్నాత‌కోత్స‌వంలో పాల్గొనేందుకు ప్ర‌ధాని వ‌స్తున్నారు. దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు ప్ర‌ధాని హైద‌రాబాద్‌లో ఉండ‌నున్నారు. ప్ర‌ధాని రాక సంద‌ర్భంగా అధికారులు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్ర‌యంలో ప్ర‌ధాని దిగింది మొద‌లు ఆయ‌న చెన్నై వెళ్లే వ‌ర‌కూ అన్ని మార్గాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు.

మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్ర‌ధానికి స్వాగ‌తం చెబుతూ.. ప్ర‌ధాని వెళ్లే మార్గాల్లో భారీగా బ్యాన‌ర్లు,ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బేగంపేట వ‌ద్ద‌కు ప్ర‌ధానికి పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్ర‌ధాని మోదీ టూర్ షెడ్యూల్‌..

- ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అటు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 1.50 గంటలకు హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి 2 గంటల సమయంలో ఐఎస్‌బీకి చేరుకుంటారు.

- మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు.

- అనంతరం తిరిగి బేగంపేటకు చేరుకుని 3.55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్ల‌నున్నారు.

ఇక ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఐటీకారిడార్‌లో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు. వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపు ఇలా..

- గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపు తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖాన, మజీద్ బండ కమాన్, హెచ్​సీయూ డిపో రోడ్ మీదుగా వెళ్లాలి.​

- విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్, హెచ్‌సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

- విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్​, నానక్​రాంగూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వాహనాలను మళ్లిస్తారు.

- కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా మ‌ళ్లిస్తారు.

Next Story