కరోనా కారణంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచింది రైల్వేశాఖ. అనంతరం పరిస్థితులు కాస్త చక్కబడడంతో మళ్లీ తగ్గించేసింది. అయితే.. తాజాగా మరోసారి ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లేందుకు జనాలు ఎక్కువగా రైల్వే స్టేషన్లకు వస్తున్నారు. వారిని ఎక్కించడానికి, కుటుంబ సభ్యులు, బంధువులు వస్తుండడంతో ప్లాట్ ఫామ్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకు రూ.10 గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధర రెట్టింపు అయ్యింది. ఈ నిర్ణయం నేటి నుంచి ఈ నెల 20 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే.. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలోని ప్లాట్‌ఫాం టికెట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.