హైదరాబాద్‌లో బ్రెయిన్ డెడ్ అయిన 14 నెలల పాప అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేశారు. దక్షిణ భారతదేశంలో అవయవాలను దానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలుగా ఆ పాప నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివసిస్తున్న శ్రీకాంత్, సంతోషి దంపతులకు కవలలు. మొదటి బిడ్డ దేవకీ శ్రీసాయి ఇటీవల డీహైడ్రేషన్‌తో బాధపడింది. తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పాపను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పాపను కాపాడేందుకు వైద్యులు మూడు రోజులుగా ప్రయత్నించారు. కానీ, దురదృష్టవశాత్తు, గురువారం రాత్రి శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వారు ప్రకటించారు.
అవయవ దానం ప్రాముఖ్యతపై శిశువు తల్లిదండ్రులు, బంధువులకు అవయవ దాన సమన్వయకర్తలు వివరించారు. ఆ తల్లిదండ్రులు పాప కిడ్నీలు, కళ్లను దానం చేయడానికి ముందుకు వచ్చారు. పాప తండ్రి శ్రీకాంత్ అమెజాన్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. పాప తల్లి సంతోషి గృహిణి. కుమార్తె మరణంతో ఆ తల్లిదండ్రులు బాధపడ్డప్పటికీ, తమ బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడినందుకు సంతోషిస్తూ ఉన్నారు. జీవందాన్ కమిటీ సభ్యుల ప్రకారం, గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు గమ్యాన్ని చేరుకున్నాయి. 2013 నుంచి ఇప్పటి వరకు 1256 మంది తమ అవయవాలను దానం చేసినట్లు జీవందాన్ వెబ్‌సైట్ పేర్కొంది. 2023లో మొత్తం 94 మంది అవయవాలను దానం చేశారు.