హైదరాబాద్ నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నట్లు పోలీసులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే 200 రూపాయలకు జరిమానాను పెంచారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో మొదటి రోజు హైదరాబాద్ పోలీసులు హెల్మెట్ ధరించని 6,631 మంది వాహనదారులకు, ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా డ్రైవ్ చేసినందుకు మరో 1,503 మందికి జరిమానాలు జారీ చేశారు. హెల్మెట్ ధరించనందుకు జరిమానా విధించిన వారిలో 1,451 మందిని ఆన్‌సైట్‌లో పట్టుకోగా, 5,180 మందిని నిఘా కెమెరాల ద్వారా గుర్తించారు. పరిమితికి మించిన వేగంతో బైక్ డ్రైవింగ్ చేసినందుకు 414 మందికి పోలీసులు జరిమానాలు విధించారు.
రాంగ్ సైడ్, రాంగ్ రూట్ వెళితే 2000 రూపాయల జరిమానా విధిస్తున్నారు అధికారులు. సిటీలోని రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లు పటిష్టంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.