వారంలో 39 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు.. 78 రోడ్డు ప్రమాదాలు.. 22 మంది మృత్యువాత..
Over 39,000 traffic violations reported in Rachakonda limits in 7 days. ట్రాఫిక్ పోలీసులు వరుస అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ..
By Medi Samrat Published on 24 Jan 2022 10:14 AM ISTట్రాఫిక్ పోలీసులు వరుస అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ.. వాహనదారులు నగర రోడ్లపై ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించడం లేదు. జనవరి 15 నుంచి 21వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 39 వేలకు పైగా కేసులు నమోదుచేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అలాగే వారంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై మొత్తం రూ.1.70 కోట్ల జరిమానా విధించారు. వారం వ్యవధిలో 78 రోడ్డు ప్రమాదాలు జరగగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి పెద్ద మానవ తప్పిదాలే ప్రమాదాలకు కారణమని అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసుల డేటా ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలు అరికట్టడం కోసం నగరం అంతటా నిర్వహించిన వివిధ స్పెషల్ డ్రైవ్‌లలో భాగంగా వారంలో మొత్తం 39,858 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు బుక్ అవగా.. రూ.1,75,58,415 జరిమానా విధించబడ్డాయి. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా కేసులు బుక్ చేసింది. వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు గానూ 118 మందిని కోర్టులో హాజరుపరచగా.. రూ.3.40 లక్షల జరిమానా విధించగా.. ఒకరికి జైలుశిక్ష పడింది.
గత వారంలో మొత్తం 78 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మానవ తప్పిదాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాల వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, స్కిడ్డింగ్ వంటి వాటి వల్లే జరుగుతున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఇంటర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు ట్రాఫిక్ ఇంజినీరింగ్ సెల్ సిబ్బంది ఇటీవల ఘోర ప్రమాద స్థలాలను సందర్శించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేశారు.
"స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యలు పరిష్కరించబడ్డాయి. ట్రాఫిక్ ఇంజినీరింగ్ సెల్ సిబ్బంది బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దడానికి చేసిన సూచనలను నిరంతరం సమన్వయం చేసి పర్యవేక్షిస్తున్నారు"అని సీనియర్ అధికారి తెలిపారు. అంతే కాకుండా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.