అన్ని కోర్సులకు నేటి నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అన్ని కాలేజీల్లోని అన్ని కోర్సులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని ఓయూ మరో పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. అంతకుముందు విశ్వవిద్యాలయ అధికారులు ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులు జరుగుతాయని తెలిపారు. నగరంలో కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రస్తుత సెమిస్టర్‌లన్నింటికీ.. ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులను కొనసాగిస్తుంది అని ఓయూ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది.
ఓయూ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఓయూ పరిధి కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సోమవారం జరిగిన సమావేశంలో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. "కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులతో సహా బోధనా సిబ్బంది జనవరి 31 నుండి కళాశాల విధులకు హాజరు కావాలి. వారు ఫిబ్రవరి 1 నుండి కళాశాల నుండి ఆన్‌లైన్ తరగతులు తీసుకుంటారు. సిబ్బంది అందరూ కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రకటనలో ఆదేశించారు. అయితే.. ఓయూ అధికారులు తమ నిర్ణయాన్ని సవరించుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.