ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పరిధిలో జనవరి 17 నుంచి 31 తేదీల మధ్య జరగాల్సిన అన్ని పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా విభాగం సోమవారం తెలిపింది. ఇదిలావుంటే.. ఉస్మానియా యూనివర్శిటీ జనవరి 17 నుండి 30 వరకు కళాశాలల సెలవులను పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి అన్ని విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ పరిపాలనా విభాగం పత్రికా ప్రకటనలో తెలిపింది.
సెలవుల నేఫథ్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఓయూ అడ్మినిస్ట్రేషన్ తమ పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాల్‌లను ఆదేశించింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి వారి ప్రదేశాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ జనవరి 30 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల సెలవులను 30. 1. 2022 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేఫథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ తెలిపింది.