విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ఫిబ్రవరి 12 వరకు పొడిగించినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ విభాగం అనుబంధ కళాశాలలను ఆదేశించింది. పాజిటివిటీ రేటు తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ తరగతులను కొనసాగించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది.
ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే కాదు.. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ అండర్ గ్రాడ్యుయేట్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 12 వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. మూడవ మరియు నాల్గవ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అభ్యర్ధులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించబడతాయి. జనవరి 8 నుండి 18 వరకు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు సంక్రాంతి సెలవుల కారణంగా మూసివేశారు. అయితే పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16 న.. జనవరి 30 వరకు సెలవులను పొడిగించింది.