కొంత మంది నిర్లక్ష్యంగా పని చేస్తుంటారు. వారు చేసే పనుల వల్ల అవతలి వారు ఇబ్బందులకు గురవుతుంటారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్దుడు 18 గంటల పాటు లాకర్ గదిలో ఉండిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కృష్ణారెడ్డి(84) అనే వ్యక్తి పని నిమిత్తం సోమవారం సాయంత్రం 4.20 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగా.. గమనించని సిబ్బంది లాకర్ గదిని మూసివేయడంతో పాటు బ్యాంకు కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎంతసేపటికి కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆందోళన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు.
కృష్ణారెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులు సీసీ కెమెరాలు చూడగా.. బ్యాంకు లాకర్ గదిలో కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో బ్యాంకు లాకర్ నుంచి అతడిని బయటకు తీసుకువచ్చారు.కాగా.. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంపై కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డికి మధుమేహంతో పాటు అల్జీమర్స్ ఉండడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటి వరకు బ్యాంక్‌పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) జోయెల్ డేవిస్ ధృవీకరించారు. అయితే.. సెక్షన్ 336 (మానవుల ప్రమాదానికి దారితీసే చర్య) కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.