ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు నాలుగో కుమార్తె కె ఉమా మహేశ్వరి (52) సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఉరివేసుకుని చనిపోయిందని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
గత కొంత కాలంగా ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం భోజనానికి ఆమె గది నుంచి బయటకు రాలేదు. ఆమె కుమార్తె దీక్షిత, ఇతర కుటుంబ సభ్యులు బలవంతంగా తలుపులు తీసి గదిలోకి ప్రవేశించి చూడగా.. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. జూబ్లీహిల్స్ పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఎన్టీ రామారావు, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం. (8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు). మృతురాలు ఉమామహేశ్వరి నాలుగో కుమార్తె. ఉమామహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉమామహేశ్వరి మృతి సమాచారం తెలియగానే నందమూరి కుటుంబసభ్యులతోపాటు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది.