హైదరాబాద్ లో నోరో వైరస్ టెన్షన్.. పిల్లలు జాగ్రత్త
Norovirus detected in kids under 5. హైదరాబాద్ లో నోరోవైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 18 April 2022 3:35 PM IST
హైదరాబాద్ లో నోరోవైరస్ కేసులు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. ఐదేళ్లలోపు ఐదుగురు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. గాంధీ ఆసుపత్రి, ఎల్లా ఫౌండేషన్ కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. నగరంలో పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ రోగులలో నోరోవైరస్ కొత్త వైవిధ్యం కనిపించిందని గాంధీ హాస్పిటల్, ఎల్లా ఫౌండేషన్ పరిశోధకులు తెలిపారు. నోరోవైరస్లు అన్ని వయసులవారిలో తీవ్రమైన విరేచనాలకు కారణమవుతాయి. మైక్రోబయాలజిస్టులు నగరంలో ఐదేళ్లలోపు పిల్లలలో నోరోవైరస్ విషయంలో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 458 మంది పిల్లల నుండి మలం నమూనాలు మరియు క్లినికల్ డేటా సేకరించబడింది.
458 మంది చిన్నారుల మల నమూనాలను సేకరించి పరీక్షించగా ఐదు కేసులు వెలుగు చూసినట్టు నిపుణులు ప్రకటించారు. నోరోవైరస్ అన్నది అన్ని వయసుల వారిలోనూ డయేరియా (అతిసారం)కు దారితీస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. డీహైడ్రేషన్ కు గురి అవుతారు. ఉన్నట్టుండి నీరసపడిపోతారు. వళ్లు కొంచెం వెచ్చపడుతుంది. కడుపులో నొప్పి రావచ్చు. ప్రధానంగా వాంతులు, విరేచనాలతో వారి శరీంలోని నీటి శాతం, లవణాల శాతం తగ్గిపోతుంది. ఈ వైరస్ బారిన పడిన వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. శిశువులు అయితే పాలు ఇవ్వడం ఆపకూడదు. ద్రవ పదార్థాలు తగినంత ఇస్తూ ఉండాలి. గదిలో వేడి వాతావరణం లేకుండా చర్యలు తీసుకోవాలి.