ఏప్రిల్‌లో ట్రాఫిక్ చలాన్లపై ఎటువంటి రాయితీ అందించబడదని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవి రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లపై అందించే తగ్గింపు మార్చి 31వ తేదీ నాటికి ముగుస్తుంది. కాబట్టి నగర ప్రజలు పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించాలని అన్నారు. ఇప్పటివరకు 1.85 కోట్ల ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయబడ్డాయని.. వీటి ద్వారా రూ. 190 కోట్లు వసూలు చేశామని.. చలాన్లపై తగ్గింపు మార్చి 31తో ముగుస్తుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రకటించిన ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిమిషానికి దాదాపు 1,000 చలాన్లు క్లియర్ అవుతున్నట్లు సమాచారం. ద్విచక్రవాహనాలు, త్రీవీలర్ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 75 శాతం కోత విధించినట్లు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దీంతో వాహనదారులు జరిమానాలో 25 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు వర్తిస్తుంది.