18న నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ అంత్యక్రియలు

Nizam VIII Mukarram Jah to be laid to rest in Makkah Masjid on 18 Jan. ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ అంత్యక్రియలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jan 2023 1:26 PM GMT
18న నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ అంత్యక్రియలు

ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ అంత్యక్రియలు జనవరి 18న అసర్ (సాయంత్ర ప్రార్థనలు) తర్వాత మక్కా: మసీదులో నిర్వహించనున్నారు. జనవరి 17 సాయంత్రం ఆయన భౌతికకాయం హైదరాబాద్ నగరానికి చేరుకోనుంది. జనవరి 18 ఉదయం నుండి, ఆయన భౌతికకాయాన్ని చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ముబారక్)లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నిజాం కుటుంబ సభ్యులు, ఆయన ట్రస్టు ట్రస్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు A.K ఖాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

A.K ఖాన్, ఇతర ప్రభుత్వ అధికారులు 8వ నిజాం మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా జా, ఫైజ్ ఖాన్‌తో సహా ఇతర ట్రస్ట్ సభ్యులను సంప్రదించి.. ఖిల్వత్ ప్యాలెస్‌లో నిజాం ఖననంపై చర్చించారు. A.K ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, జనవరి 18న ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ అంత్యక్రియలు జరుగుతాయని ధృవీకరించారు.

ఆయన పార్థివదేహం జనవరి 17న హైదరాబాద్‌కు వస్తుందని, ఆ మరుసటి రోజు ఆయన భౌతికకాయాన్ని ఖిల్వత్ ప్యాలెస్‌లో ప్రజల కోసం ఉంచుతామని ఫైజ్ ఖాన్ తెలిపారు. ఆయన అంతిమ యాత్ర ఖిల్వత్ ప్యాలెస్ నుండి మక్కా మసీదుకు ప్రారంభమవుతుంది, అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆసిఫ్ జాహీ రాజవంశానికి చెందిన ఇతర పాలకులు ఖననం చేసిన మక్కా మసీదు లాన్‌లో ఎనిమిదో నిజాంను కూడా ఖననం చేస్తారు. A.K ఖాన్, ఫైజ్ ఖాన్, కొంతమంది పోలీసు అధికారులతో కలిసి, ఏర్పాట్లను చూసేందుకు ఖిల్వత్ ప్యాలెస్, మక్కా మసీదును సందర్శించారు. ముకర్రం జా బహదూర్ అంతిమ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఎ.కె ఖాన్ తెలిపారు. గత నిజాం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వమే నిర్వహించిందన్నారు.

హైదరాబాద్ యొక్క ఏడవ , చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 14 జూన్ 1954న ప్రిన్స్ ముకరం ఝాను తన వారసుడిగా ప్రకటించారు. ముకరం ఝాను 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలిచారు. నవాబ్ ఆజం జా బహదూర్, టర్కీ చివరి పాలకుడు ఖలీఫా అబ్దుల్ మజీద్ II కుమార్తె అయిన యువరాణి దుర్రుషెహ్వార్‌ల పెద్ద కుమారుడు. ముకర్రం జా టర్కిష్, దక్కనీ రాజ కుటుంబాల వారసుడు. ముకరం ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. అందులో భాగంగా ఏకే ఖాన్ అన్ని ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు.


Next Story