గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఎమ్మెల్యే దానం

ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు

By Medi Samrat  Published on  17 July 2024 9:14 AM GMT
గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఎమ్మెల్యే దానం

ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతి పనుల పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే ఉంటారని తెలిపారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామ‌న్నారు. ఈ ఏడాది 70 సంవత్సరం కావడంతో మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు.

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య విభేదాల నేపథ్యంలో అడ్ హాక్ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేసామని దానం నాగేందర్ వెల్లడించారు. రెండు కమిటీ ఆలోచనలను పరిగణలోనికి తీసుకున్నాం. అందరు ఉత్సవ కమిటీ సభ్యులేన‌న్నారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తామ‌న్నారు. 11 రోజులు నిర్వహించే పూజకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నామ‌ని.. దీనిని బాధ్యతగా భావించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని.. అడ్ హాక్ పేరుతో ఖైరతాబాద్ గణేష్ కొత్త ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశాం. ఉత్సవ కమిటీని 5 విభాగాలుగా చేసి ఉత్సవాలు నిర్వహించేలా బాధ్యతలు అప్పగిస్తామ‌న్నారు.

డొనేషన్స్ నుండి వచ్చే డబ్బును రోజు డిస్‌ప్లే చేస్తాం. విద్యా, ఆర్థిక స్థోమత లేని వారికీ సహాయం అందిస్తామ‌ని తెలిపారు. మల్టి పర్పస్ కమ్మూనిటి హాల్ కట్టబోతున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ వాసులు నామినల్ ఫీ కట్టి హాల్ ను వినియోగించుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. నేను అధ్యక్షత వహిస్తున్నా.. కొత్త కమిటీ లో రాజ్ కుమార్ చైర్మన్ ఉంటారని తెలిపారు.

100 మందితో అడ్ హాక్ ఉత్సవ్ కమిటీ లో సభ్యులు ఉంటారు. ఉత్సవ కమిటీలో వందలమంది సభ్యులు ఉంటారు. కమిటీ సభ్యులకు ఐడీ కార్డు ఉంటుందన్నారు. ఎన్నారైలు డైరెక్ట్ గా వచ్చి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. రోజు ప్రసాదాలు పంపిణీ చేస్తాం. పోలీసులు, మీడియా, వాలంటీర్స్‌కు భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. బోనాల ఫెస్టివల్ తర్వాత దూప దీపాలకు నోచుకోని అన్ని టెంపుల్స్ కు కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని దానం నాగేందర్ వెల్లడించారు.

Next Story