బిగ్‌బ్రేకింగ్.. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేదం
New Year Celebrations Ban In Hyderabad. కరోనా వైరస్ పుణ్యమా అని ఈ సంవత్సరం ఒక్క పండుగను కూడా సరిగా జరుపుకోలేదు
By Medi Samrat Published on 25 Dec 2020 8:35 AM GMT
కరోనా వైరస్ పుణ్యమా అని ఈ సంవత్సరం ఒక్క పండుగను కూడా సరిగా జరుపుకోలేదు హైదరాబాద్ నగరవాసులు. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టుతుండడం.. మరో వారంలో భారత్‌లో దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భావించారు నగరవాసులు. అయితే.. వారికి షాకిచ్చారు సీపీ సజ్జనార్.
ప్రస్తుతం కరోనా వైరస్, కరోనా న్యూ స్ట్రెయిన్ కారణంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యూఇయర్ కోసం ఏర్పాటు చేసుకునే పబ్లిక్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ ను మొదలుపెట్టామని, రిసార్ట్స్, పబ్ లపై నిఘాను ఉంచామన్నారు. తాగి వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామని అన్నారు. పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని, గ్రేటర్ కమిటీలో కూడా కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించినట్టు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.