దళిత బంధు పథకంతో సరికొత్త తరహా ఉపాధి

New type of employment with Dalit Bandhu scheme. దళిత బంధు తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి

By Nellutla Kavitha  Published on  26 July 2022 12:22 PM GMT
దళిత బంధు పథకంతో సరికొత్త తరహా ఉపాధి

దళిత బంధు తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ డబ్బుతో ఇప్పటిదాకా జెసిబిలు, వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లను కొనుగోలు చేసిన దళిత కుటుంబాలు కనిపించాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమలతోపాటుగా, సొంతంగా వ్యాపారం ప్రారంభించిన మహిళలు, యువత కూడా ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులు సరికొత్త తరహా ఆలోచన చేశారు.


దళిత బంధు పథకం కింద వచ్చిన డబ్బులతో ఇలా వాహనాలను కొనుగోలు చేసి, వాటికి కాస్త మార్పులు, చేర్పులు చేసి డాగ్ గ్రూమింగ్ @ డోర్ స్టెప్ గా మార్చేశారు. హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ మురళీధర్ కి వచ్చిన ఆలోచనను ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పంచుకోవడంతో, ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. దీంతో తొమ్మిది మంది దళిత బందు లబ్ధిదారులు తాము కొనుగోలు చేసిన వాహనాలను వెటర్నరీ డాక్టర్ మురళీధర్ కు అయిదేళ్లపాటు లీజుకు ఇచ్చేలా ఒప్పందం కూడా జరిగిపోయింది. పెట్ డాగ్స్ కి అవసరమైన సకల సదుపాయాలు, మన ఇంటి ముందే లభించేలా ఈ వాహనంలో అందుబాటులో వుంటాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పెట్ డాగ్స్ కి అవసరమైన సేవలు పెట్ గ్రూమింగ్ @ డోర్ స్టెప్ లో లభిస్తాయి.

గచ్చిబౌలి డాగ్ పార్క్ లో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో, దళిత బంధు ద్వారా 9 మంది లబ్ధిదారులకు అందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ వాహనాలను లీజుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు నెలకు 30 నుంచి 40 వేల వరకూ సంపాదించుకునే అవకాశం వస్తుందని హరీష్ రావు అన్నారు. దీని ద్వారా లబ్ధిదారులకు శిక్షణ కూడా ఇప్పించారని, సంగారెడ్డి జిల్లా ఆందోల్ నుంచి వచ్చిన లబ్ధిదారులు హైదరాబాదులో కూడా పెట్ గ్రూమింగ్ తో ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నారని అన్నారు హరీష్ రావు. ఇప్పటికే దళిత బంధు ద్వారా వరి కోత యంత్రాలతో లబ్ధిదారులు ఒక్క నెలలోనే దాదాపు మూడు లక్షల రూపాయలు లాభం పొందారని, ఇప్పుడు డాగ్ వాహనాలనుతో మరో రకంగాను ఉపాధి లభించడం ఆనందంగా ఉందంటున్నారు MLA క్రాంతి. పైలెట్ ప్రాజెక్టు కింద ఆంధోల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నామని త్వరలోనే ఇలాంటి డాగ్ గ్రూమింగ్ వాహనాలను తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రారంభిస్తామని అంటున్నారు వెటర్నరీ డాక్టర్ మురళీధర్.


Next Story
Share it