హైదరాబాద్: జీహెచ్ఏంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మృత్యువు ఎప్పుడు ఏ విధంగా కబలిస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం.. ఓ చిన్న పని మీద బయటకు వెళ్లిన ఓ హార్డ్వేర్ ఇంజనీర్‌ని మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబలించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గుమ్మడి కుంట్ల గ్రామానికి చెందిన తుమ్మ భావన ఋషి (35) గత పది సంవత్సరాలుగా హైదరాబాదు నగరంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోనే హార్డ్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి సమయంలో భావన ఋషి జిరాక్స్ పని మీద బయటకు వెళ్లాడు.
కృష్ణ నగర్ ప్రధాన దారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. హార్డ్ వేర్ ఇంజినీర్ తుమ్మ భావన ఋషి (35) స్తంభం పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భావన ఋషి చెయ్యి స్తంభానికి తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. దీంతో భావన ఋషి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడంటూ మృతుడి భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.