నారాయణ జూనియర్ కాలేజ్ గడ్డిఅన్నారం బ్రాంచ్‌లో ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇంఛార్జ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో విద్యార్థి దవడ ఎముక విరిగింది. దీనిపై విద్యార్ధి కుటుంబ సభ్యులు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్ మాలి సతీష్‌పై కేసు నమోదు చేసిన మలక్ పేట పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో కాలేజ్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ విషయంలో కలగజేసుకున్న ఇంఛార్జ్ మాలి సతీష్ విద్యార్థులను చితకబాదాడు. ఈ దాడిలో సాయి పునీత్ అనే విద్యార్ధి దవడ ఎముక విరిగింది.
ఈ విషయమై సాయి పునీత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమారుడు దవడ ఎముక విరిగి తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇంఛార్జ్ మాలి సతీష్, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.