ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రోను పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ ప్రకారం.. ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్(అబ్దుల్లాపూర్‌మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉంది. హైదరాబాద్ నగరం ఆవైపు వేగంగా విస్తరిస్తోంది. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు. ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంటోంది. సాధారణ ప్రజలకు ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోంది. ఈ లైన్ ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదు. రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పైగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ మార్గంలోని జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా మారుస్తోంది కేంద్రం. రానున్న రోజుల్లోవాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే అవకాశం ఉంటుంది. మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉంది. ఈ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ పురికి గతంలో లేఖ రాశాను. దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్రానికి నేను రాసిన లేఖను, రాష్ట్రప్రభుత్వానికి ఢిల్లీ నుంచి వచ్చిన లేఖను కూడా మీకు పంపుతున్నాను. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.