హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) కి చెందిన కదులుతున్న ఎలక్ట్రిక్ బస్సులో శుక్రవారం ఉదయం బేగంపేటలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం 9 గంటల సమయంలో బస్సు బేగంపేట నుంచి ప్యారడైజ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ గమనించి రోడ్డుపై వాహనాన్ని ఆపడంతో బస్సు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు దిగి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో బస్సు సిబ్బంది అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నది. " షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని మేము అనుమానిస్తున్నాము " అని ఒక అధికారి తెలిపారు. ఇక ఇటీవల ఆర్టీసీ బస్సు కిందకు బైక్ దూసుకువెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్థమైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోకు చెందిన రాజధాని బస్సు ప్రయాణీకులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెలుతోంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ కు సమీపంలో బస్సు స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ బస్సు కిందకు వెళ్లిపోయింది. మంటలు చెలరేగాయి. బస్సుకు మంటలు వ్యాపించాయి.