ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పిలువబడుతున్న అంగూర్ బాయ్‌ని కార్వాణ్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గంజాయి అమ్మకాలతో రూ. కోట్లకు పడుగెత్తిన అంగూర్ బాయ్.. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసుల్లో, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో 4 కేసుల్లో, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో పది కేసుల్లో ముద్దయిగా ఉంది. ఈ కేసుల్లో అంగూర్ బాయ్‌ను అరెస్టు చేయడానికి ఎక్సైజ్, ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్నిమార్లు నిఘా పెట్టిన తప్పించుకుని తిరుగుతుంది.
ఇదిలావుంటే.. అంగూర్ బాయ్ ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలుగా జైలుకు వెళ్లి వచ్చింది. ఈ కేసులలో కోర్టుల చుట్టు తిరుగుతుంది. అంగూర్ బాయ్ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులలో పది నుంచి 15 మందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయి. ధూల్‌పేట్‌లో గంజాయి హూల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయ్‌ని అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. అంగూర్ బాయ్‌ని అరెస్టు చేసిన ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.