మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘ‌ట‌న‌.. చికిత్స పొందుతూ యువ‌తి తల్లి మృతి

Miyapur Lover attack case girl friend mother dead.ప్రేమోన్మాది దాడి ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌తి త‌ల్లి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2022 12:40 PM IST
మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘ‌ట‌న‌.. చికిత్స పొందుతూ యువ‌తి తల్లి మృతి

మియాపూర్‌లో ప్రేమోన్మాది దాడి ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌తి త‌ల్లి శోభ మ‌ర‌ణించింది. గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆమె కొద్దిసేప‌టి క్రిత‌మే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మ‌రోవైపు గాంధీ ఆస్ప‌త్రిలోనే బాధితురాలు కోలుకుంటోంది. యువ‌తి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిపారు.

హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన ఓ యువతి (19) తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. వీరు స్వ‌గ్రామంలో ఉన్న‌ప్పుడు ఇంటి స‌మీపాన ఉండే సందీప్ అనే యువ‌కుడు యువ‌తితో స్నేహం చేశాడు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రు ప్రేమించుకున్నారు. విష‌యం ఇంట్లోవాళ్ల‌కి తెలియ‌డంతో యువ‌తిని మంద‌లించారు.

యువ‌తి అత‌డిని దూరం పెట్టింది. అప్ప‌టి నుంచి త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువ‌తిని సందీప్ వేధించేవాడు, గొడ‌వ‌ప‌డేవాడు. సోద‌రుడికి ఉద్యోగం రావ‌డంతో యువ‌తి కుటుంబం హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. యువ‌తికి వేరే వ్య‌క్తితో వివాహం నిశ్చ‌యించారు. వ‌చ్చే ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న సందీప్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని యువ‌తి ఇంటికి వ‌చ్చాడు.

త‌న‌ను పెళ్లి చేసుకోవాంటూ గొడ‌వ‌కు దిగాడు. త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో యువ‌తిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె త‌ల్లిని తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. అనంత‌రం త‌న గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా.. చికిత్స పొందుతూ యువ‌తి త‌ల్లి నేడు(బుధ‌వారం) మ‌ర‌ణించింది.

Next Story