గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి తలసాని
Minister Talasani Review Meeting On Ganesh Festival. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని
By Medi Samrat Published on 28 Aug 2021 4:00 PM GMTగణేష్ నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మంత్రి తలసాని అద్యక్షతన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 10వ తేదీన విగ్రహాల ప్రతిష్టతో ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు 19వ తేదీన నిర్వహించే నిమజ్జనం కార్యక్రమంతో ముగుస్తాయన్నారు.
విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆంక్షలు లేవని, నిర్వహకులు ఆయా ప్రాంతాలలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల విషయంలో పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలాంటి అధికారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. నగరంలో ఎంతో ప్రసిద్ది గాంచిన బాలాపూర్ గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా ద్వంసమైందని ఉత్సవ నిర్వహకులు సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతాన్ని సోమవారం నాడు సందర్శించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని జీహెచ్ఎంసి కమిషనర్ కు మంత్రి సూచించారు.
హైదరాబాద్ లో నిర్వహించే ఈ గణేష్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మతాల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇటీవల నిర్వహించిన బోనాల ఉత్సవాల తరహాలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమాయత్తంగా ఉండాలని ఆయన సూచించారు.