హైద‌రాబాద్ వాసుల‌కు మంత్రి కేటీఆర్ న్యూ ఇయ‌ర్ కానుక‌

Minister KTR to Inaugurate Kothaguda Flyover Today.కొత్త సంవ‌త్స‌రం వేళ కొత్త‌గూడ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2023 3:45 AM GMT
హైద‌రాబాద్ వాసుల‌కు మంత్రి కేటీఆర్ న్యూ ఇయ‌ర్ కానుక‌

కొత్త సంవ‌త్స‌రం వేళ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ ట్రాఫిక్ క‌ష్టాలు కొంత వ‌ర‌కు తీర‌నున్నాయి. నేటి నుంచి కొత్త‌గూడ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించ‌నున్నారు. కొత్త‌గూడ నుంచి గ‌చ్చిబౌలి వ‌ర‌కు రూ.263 కోట్ల వ్య‌యంతో 2216 మీట‌ర్ల పొడవున ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు.

ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌స్తే గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు దాదాపుగా తీర‌నున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ను ఎస్ఆర్‌డిపి కార్యక్రమంలో భాగంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) నిర్మించింది. ఈ ఫ్లై ఓవ‌ర్ పొడ‌వు 2,216 మీట‌ర్లు. అందులో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ నుంచి బొటానికల్ జంక్షన్ వరకు ఐదు లేన్లతో, బొటానిక‌ల్ జంక్ష‌న్ నుంచి కొత్త‌గూడ జంక్ష‌న్ వ‌ర‌కు 6 లేన్లు, కొత్త‌గూడ జంక్ష‌న్ నుంచి కొండాపూర్ ఆర్డీఏ ఆఫీస్ వ‌ర‌కు 3 లేన్ల రోడ్డుతో ఈ ఫైఓవ‌ర్‌ను పూర్తి చేశారు,

మ‌సీదు బండ నుంచి బొటానిక‌ల్ జంక్ష‌న్ ట్రాఫిక్ కోసం రెండు లేన్ల‌తో బొటానిక‌ల్ అప్ ర్యాంప్‌, కొత్త‌గూడ నుంచి హైటెక్ సిటీ వెళ్లేందుకు 383 మీట‌ర్ల పొడ‌వుతో హైటెక్ సిటీ వైపు 3 లేన్ల డౌన్ ర్యాంపును ఏర్పాటు చేశారు. హ‌ఫీజ్‌పేట వెళ్లేందుకు 470 మీట‌ర్ల పొడ‌వుతో 3 లేన్ల అండ‌ర్ పాస్‌ను నిర్మించారు.

ఈ ఫ్లై ఓవ‌ర్ వ‌ల్ల బొటానిక‌ల్ గార్డెన్‌, కొత్త‌గూడ‌, కొండాపూర్ జంక్ష‌న్‌ల మ‌ధ్య చాలా త‌క్కువ దూరంలో ఉన్న కూడ‌ళ్ల నుంచి సాఫీగా వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ జంక్ష‌న్ల ప‌రిస‌రాల్లో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండ‌డంతో ర‌ద్దీ స‌మ‌యంలో ట్రాఫిక్ స‌మ‌స్య చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు పరిసర ప్రాంతాలను కలుపుతుంది. ఈ వంతెన వల్ల బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ జంక్షన్‌లలో 100 శాతం ట్రాఫిక్‌ సమస్య పరిషారం అవడమే కాకుండా కొండాపూర్‌ జంక్షన్‌లో 65 శాతం ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది.

Next Story
Share it