న్యూస్ మీటర్‌ను ఫ్యాక్ట్ చెకింగ్ భాగస్వామిగా ఎంచుకున్న మెటా
Meta adds NewsMeter as a fact-checking partner in India. ప్రజలను నిరంతరం కనెక్ట్ చేసే అంతర్జాతీయ సంస్థగా పేరు తెచ్చుకుంది మెటా.
By Medi Samrat Published on 26 July 2022 7:19 PM ISTప్రజలను నిరంతరం కనెక్ట్ చేసే అంతర్జాతీయ సంస్థగా పేరు తెచ్చుకుంది మెటా. ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయినటువంటి మెటా.. ఎప్పటికప్పుడు నిజమైన సమాచారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఎలాంటి అవాస్తవాలకు అసలు చోటు ఇవ్వకూడదనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తూనే ఉంది. అందులో భాగంగా ఫ్యాక్ట్ చెకింగ్ కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చెకింగ్ కార్యక్రమాలను భారతదేశంలో మరింత విస్తరించనుంది. ఇందుకోసం, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల కోసం న్యూస్ మీటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మెటా. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రజలను ఖచ్చితమైన మరియు ధృవీకరించబడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని భావిస్తోంది. దీనివల్ల తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళంతో ఇతర ప్రాంతీయ భారతీయ భాషల్లో వాస్తవాలను, నిజాలను మరింత మెరుగ్గా అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
అంతర్జాతీయంగా, మెటా 60కి పైగా భాషల్లో కంటెంట్‌ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఇందుకోసం 80 కంటే ఎక్కువ మంది ఫ్యాక్ట్ చెకింగ్ భాగస్వాములతో ఎప్పటికప్పుడు కలిసి పని చేస్తుంది. మెటాతో కలిసి పనిచేస్తున్న ఫ్యాక్ట్ చెకింగ్ భాగస్వాములంతా… అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్రంగా, పక్షపాతం లేకుండా పనిచేసే ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ ద్వారా సర్టిఫై చేయబడిన వాళ్లే. ఇప్పుడు ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో ఉన్నటువంటి 11 ఫ్యాక్ట్ చెకింగ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తూ వాస్తవాలను తనిఖీ చేస్తుంది మెటా. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా మెటాకు అత్యధిక సంఖ్యలో ధర్ట్ పార్టీ భాగస్వాములను కలిగి ఉన్న దేశంగా భారత్ మారింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్ట్ చెకింగ్ కార్యక్రమం 11 నుంచి 15 భాషలకు పెరిగింది. కొత్తగా ఇందులోకి కాశ్మీరీ, భోజ్‌పురి, ఒరియా మరియు నేపాలీలను చేర్చింది.
ఈ సందర్భంగా భారతదేశంలో మెటా డైరెక్టర్ మరియు పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ శ్రీ మనీష్ చోప్రా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… "మేము తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నాము. అందుకోసమే అంతర్జాతీయ స్థాయి ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్‌ను రూపొందించాం. ఇప్పుడు న్యూస్‌మీటర్‌తో భాగస్వామ్యం ద్వారా.. ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాంతీయ భారతీయ భాషల్లో ఉన్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడం మాకు మరింత సులువు అవుతుంది అని అన్నారు.
ఫ్యాక్ట్ చెకర్ ఒక కంటెంట్‌లో కొంత భాగాన్ని తప్పని చెప్పినా, మార్చారని అన్నా లేదా పాక్షికంగా తప్పు అని చెప్పినా కూడా వెంటనే మేము దాని వ్యాప్తిని తగ్గించేస్తాము. తద్వారా తక్కువ మంది వ్యక్తులు మాత్రమే దాన్ని చూడగలరు. మేము కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నించే వ్యక్తులకు - లేదా ఇంతకు ముందు భాగస్వామ్యం చేసిన వ్యక్తులకు.. ఈ సమాచారం ఫ్యాక్ట్ చెకర్ ద్వారా రేట్ చేయబడిందనే సమాచారాన్ని అందిస్తాము. అంతేకాకుండా దానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెకర్ అందించిన నిజమైన సమాచారాన్ని ఇస్తూ.. వార్నింగ్ లేబుల్‌ని జోడిస్తాము.
దీంతోపాటు.. ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు మెటా ఇతర చర్యలు కూడా తీసుకుంటోంది. భారతీయ వార్తా సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఫ్యాక్ట్ చెకింగ్ న్యూస్ ఫెలోషిప్ కార్యక్రమానికి నిధులు కూడా సమాకూరుస్తోంది. ఇందుకోసం ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI)తో కూడా కలిసి పనిచేస్తోంది మెటా.