పబ్‌లు పలు అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయా..? డ్రగ్స్ మత్తులో యువత రెచ్చిపోతున్నారా..? అంటే.. వరుసగా ఇటీవల జరుగుతున్న ఘటనలతో హైదరాబాదీ ప్రజల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్న అమ్నీషియా పబ్ కు వచ్చిన మైనర్ బాలికను ట్రాప్ చేసి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే ఓ హోటల్‌లో ఓ యువతిపై యువకులు దాడి చేసి, అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ నేషన్స్ కోసం పని చేస్తున్న ఓ యువతి.. ఇద్దరు స్నేహితులతో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని రూఫ్ టాప్ లాంజ్‌కి వెళ్లింది. అయితే.. పబ్‌లో 8 మంది యువకులు ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగారు. ఇందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు. పక్కకి తీసుకువెళ్లిన అబ్రార్, సాధ్ అనే యువకులు ఆమెపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.
అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అడ్డువచ్చిన స్నేహితురాలిపై మద్యం సీసాతో యువకులు దాడి చేశారు. అడ్డుకోబోయిన పబ్ నిర్వాహకులపైనా బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి బాధితురాలు ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. పబ్ సీసీ ఫుటేజీని బయటపెడ్డాలని యువతి డిమాండ్ చేసింది. బాధితురాలు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తోంది. నిందితులంతా బడాబాబుల పిల్లలుగా గుర్తించినట్లు తెలుస్తోంది.