అతిపెద్ద‌ క్యాథలిక్ వేడుకకు వేదిక కానున్న హైద్రాబాద్ అగ్ర‌పీఠం

Mega Mass to celebrate Bishop Anthony Poola's elevation to Cardinal on Sept 15th. సెప్టెంబర్ 15న హైదరాబాద్ మహనగరం అతి గొప్ప క్యాథలిక్ వేడుకకు వేదిక కానున్నది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sept 2022 6:47 PM IST
అతిపెద్ద‌ క్యాథలిక్ వేడుకకు వేదిక కానున్న హైద్రాబాద్ అగ్ర‌పీఠం

సెప్టెంబర్ 15న హైదరాబాద్ మహనగరం అతి గొప్ప క్యాథలిక్ వేడుకకు వేదిక కానున్నది. ఈ వేడుకలో కొత్తగా నియమితులైన కార్డినల్ పూలఅంథోనితో పాటు ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది పీఠాదిపతులతో సహా 500 మంది గురువులు పాల్గొననున్నారు. సెంట్మరీస్ హైస్కూల్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోయే మహోత్సవ ప్రధాన పూజలో వేలాదిమంది క్రైస్తవ, కథోలిక విశ్వాసులు పాల్గొననున్నారు. ఇటీవల ఆగస్టు 27న వాటికన్ నగరంలో జరిగిన వేడుకలలో పోప్ ఫ్రాన్సిస్ గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాఘన పూల అంథోనిని కార్డినల్ గా నియమించిన సంగతి విదితమే.

ఈ సందర్భంగా కార్యక్రమ మీడియా కమిటీ కన్వీనర్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ.. 2000 సం॥రాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్ గా పూల అంథోని నిలిచారని, ఆర్చిబిషప్ పూల అంథోని కార్డినల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా పూజను నిర్విహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆగ్రా, అగ్ర పీఠాధిపతి రఫేమాంజలి, భారతదేశం, నేపాల్ అపోస్తలిక్ మున్షియో, వారి కార్యదర్శులు వికార్ జనరల్ గాబ్రియెల్ పెన్సే. బెర్హంపూర్ పీఠాదిపతి శరత్చంద్రనాయక్, బెంగుళూరు వికార్డజనరల్ సి. ఫ్రాన్సిస్, బల్లారి పీరాధిపతి హెన్రీ డినేజా హాజరుకానున్నారని తెలిపారు.

ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన పీఠాధిపతి పూల అంథోని జనవరి 2021, హైదరాబాద్ అగ్ర పీఠాదిపతిగా అభిషేకింపబడి ఇప్పుడు కార్డినల్ గా ఎదిగారు. ఇటీవల పోపు. ప్రపంచవ్యాప్తంగా 21 మందిని కొత్తగా కార్డినల్ గా ప్రకటించగా వారిలో ఇద్దరు భారతదేశం చెందినవారు. వారిలో ఒక‌రు పూలఅంథోని కాగా.. మ‌రొక‌రు గోవా అగ్రపీఠాధిపతి ఫిలిప్నారి అంటోనియో.

కార్డినల్ గా నియమితులై రోమ్ నుండి తిరిగివచ్చిన తరువాత పూల అంథోని మాట్లాడుతూ.. ఇది కథోలిక్ సంఘానికి గర్వకారణమని, పోప్ ఫ్రాన్సిస్ ఆదేశాల మేరకు పేదలకు, అనగారిన ప్రజలకు సేవచేస్తానని తెలిపారు. కార్డినల్ పూల అంథోని.. ఫిబ్రవరి 1992లో గురువుగా నియమితులై ఫిబ్రవరి 2008లో కర్నూలు పీఠాదిపతులుగా నియమితుల‌య్యారు.

పూల అంథోని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలుజిల్లా, చెందుకూరు గ్రామం. పూల అంథోని కర్నూలు మైనర్ సెమినరీ, సెంట్ పీటర్స్ మేజర్ సెమినరి బెంగుళూరులో విద్యనభ్యసించినారు. ఆయన యూత్ కమిషన్ చైర్మన్ గా, ఆంద్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సొసైటికార్యదర్శిగా తెలుగు కథోలిక పీఠాదిపతుల సమాఖ్యకోశాధికారిగా వివిధ హోదాలలో సేవలందించారు. పూలఅంథోని హైదరాబాద్ అగ్రపీఠానికి కార్డినల్ హోదాలో కొనసాగనున్నారు. దీనితో పాటుగా ఆయన ఆదిలాబాద్, కడప, ఖమ్మం, కర్నూలు, నల్గొండ, వరంగల్ పీఠాలను పర్యవేక్షిస్తారు.

ఈ కార్యక్రమ బాధ్యతలను హైదరాబాద్ అగ్రపీఠం వికార్జనరల్ యెరువ బాలశౌరి, ఛాన్సలర్, ప్రొక్యూరేటర్ విక్టర్ ఇమాన్యుయెల్ పర్యవేక్షిస్తారు.




Next Story