హైదరాబాద్‌లో విషాదం.. బస్సు ఢీకొని మహిళా స్వీపర్‌ మృతి

హైదరాబాద్ నగరంలోని రాంకోట్ వద్ద సోమవారం ఉదయం బస్సు ఢీకొనడంతో జీహెచ్‌ఎంసీ స్వీపర్ మృతి చెందింది .

By అంజి  Published on  28 Aug 2023 4:43 AM GMT
GHMC, Hyderabad, Medical College, accident

హైదరాబాద్‌లో విషాదం.. బస్సు ఢీకొని మహిళా స్వీపర్‌ మృతి

హైదరాబాద్‌ నగరంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విధి నిర్వహణలో భాగంగా ఈరోజు ఉదయం డ్యూటీకి వచ్చిన ఒక మహిళ మృత్యువాత పడడంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవాళ ఉదయం రామ్ కోటిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తున్న మహిళ అక్కడి కక్కడే మృతి చెందింది. ఉదయం 7:45 గంటల ప్రాంతంలో మెడికల్ కాలేజ్ మినీ బస్సు అత్యంత వేగంగా వస్తున్న సమయంలో రామ్ కోటి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి స్వీపర్‌ టి.సునీతను ఢీ కొట్టింది. సునీత తన విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై ఊడుస్తున్న సమయంలో మొయినాబాద్‌లోని అయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా డ్రైవర్‌ అదుపు తప్పి ఢీకొట్టాడు.

బస్సు జీహెచ్‌ఎంసీ స్వీపర్‌ టి.సునీత ఢీ కొట్టి అనంతరం చెట్టు ను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులకు గాయాలు కాగా, జిహెచ్ఎంసి స్వీపర్ సునీత అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే మినీ బస్ మెడికల్ కాలేజీ డ్రైవర్ బస్సును వదిలేసి అక్కడి నుండి పరారయ్యాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు 108 కి అంబులెన్స్ కి కాల్ చేసి సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్‌పై నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారు.

Next Story