హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న కెప్టెన్ గిరి (75) ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ వ్యక్తి, పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకువచ్చాడు. అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి, ఆయన్ను కట్టేశారు. ఆ తర్వాత ఇంట్లోని బీరువాను పగులగొట్టి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు.
దాదాపు 25 తులాలకు పైగా బంగారం, రూ. 23 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కార్ఖానా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.