హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కింగ్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కారు మెకానిక్ షెడ్‌లో మంటలు చెలరేగాయి. ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
బొగ్గులకుంటలో గల ఓ కారు మెకానిక్ షెడ్‌లో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దట్టమైన పొగ ఆ ప్రాంతంలో అలుముకుంది. స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఎంతో శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోష్ సజీవదహనం అయ్యాడు. మంటల్లో మొత్తం ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు దక్కన్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.