ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ లేనిది కొందరు ఏ పని చేయడం లేదు. అయితే.. సెల్‌ఫోన్లను వినియోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లను చార్జింగ్ పెట్టి మాట్లాడకూడని హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు వీటిని పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో ఫోన్ చార్జీంగ్ పెట్టి మాట్లాడుతుండగా యువకుడు మృత్యువాత పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అసోం రాష్ట్రానికి చెందిన భాస్కర్ జ్యోతినాథ్ (20) బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని శంకర్‌పల్లికి వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం కూడా తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా.. ఫోన్ ఒక్కసారిగా షాక్ కొట్టింది. చేతులతో పాటు చెవుల భాగం కాలిపోయింది. స్నేహితులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.