హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం సైరన్ మోగిస్తూ పెంపుడు కుక్కను తరలిస్తున్న అంబులెన్స్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
అంబులెన్స్ మిస్‌యూస్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా.. పోలీసులు వేగంగా వెళ్తున్న ఆ వాహనాన్ని ఆపి.. రోగికి బదులుగా అంబులెన్స్‌లో కుక్క ఉన్నట్లు గుర్తించారు. హిమాయత్‌నగర్ నుంచి మదీనాగూడలోని ఐవీ ఆస్పత్రికి కుక్కను న్యూటరింగ్ కోసం తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు.
నాన్ ఎమర్జెన్సీకి కూడా సైరన్ వాడడంపై పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. అతడు నోరు మెదపలేదు. అంబులెన్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూలై 23 నుంచి జూలై 27 వరకు నిర్వహించిన అధ్యయనంలో 49 శాతం మంది డ్రైవర్‌లు అత్యవసర కేసులలో సైరన్‌లను ఉపయోగిస్తున్నారని తేలింది. మిగిలిన 51 శాతం మంది డ్రైవర్లు అంబులెన్స్ సైరన్లను మిస్‌యూస్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 310 అంబులెన్స్‌లపై తనిఖీలు జరిగాయి.