Hyderabad: సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉప్పల్‌ బస్‌ స్టాప్‌ ఎదురుగా ఉన్న షాపింగ్‌ మాల్‌లో మంగళవారం రాత్రి 10 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

By అంజి  Published on  3 Jan 2024 7:44 AM IST
Fire, CMR mall, Uppal, Hyderabad

Hyderabad: సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉప్పల్‌ బస్‌ స్టాప్‌ ఎదురుగా ఉన్న షాపింగ్‌ మాల్‌లో మంగళవారం రాత్రి 10 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బస్‌స్టాప్‌లో ఉన్న ప్రయాణికులు అక్కడి నుండి పరుగులు తీశారు. షాపింగ్ మాల్ ముందు ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు.

గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో మాల్ లో సిబ్బంది, కస్టమర్లు లేరని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన కాసేపటికే మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Next Story