హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలపాలైన వారిని ఉస్మానియా, డీఆర్డీవో, హైదర్‌గూడ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ తర్వాత పదకొండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక అధికారుల ప్రకారం, అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.