చీటీ పాట కోసం రచ్చ.. మహిళ వేలు కొరికేశాడు
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చీటీ డబ్బులు, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో ఓ మహిళ వేలును ఓ వ్యక్తి కొరికేశాడు.
By Medi Samrat
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చీటీ డబ్బులు, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదంలో ఓ మహిళ వేలును ఓ వ్యక్తి కొరికేశాడు. జవహర్‌నగర్‌కు చెందిన సుజితకు మధురానగర్‌లో ఓ పెంట్‌హౌస్ ఉంది. ఆ ఇంట్లో మమత అనే మహిళ గత మూడేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఇంటి యజమానురాలు సుజిత, తన దగ్గర అద్దెకుంటున్న మమత వద్ద చీటీలు వేసింది. ఈ క్రమంలో సుజిత, మమతకు సుమారు 30 వేలు రూపాయలు చీటీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం మమత ఆ ఇంటిని ఖాళీ చేసి, తన స్నేహితురాలైన సుప్రియకు ఆ ఇంటిని అద్దెకు ఇప్పించింది. వారం రోజులు తిరగకుండానే సుప్రియ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఆమె ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. తనకు రావాల్సిన చీటీ డబ్బులు వసూలు చేసుకునేందుకు మమత తన భర్త హేమంత్‌తో కలిసి సుజిత ఇంటికి వెళ్లింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
గొడవ పెద్దది అవుతుండటంతో సుజిత తల్లి లత (45) జోక్యం చేసుకుని వారిని ఆపే ప్రయత్నం చేసింది. తీవ్ర ఆవేశానికి లోనైన హేమంత్, అడ్డువచ్చిన లత కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికేశాడు. ఈ దాడిలో లత వేలు పూర్తిగా తెగి కిందపడిపోయింది. ఆసుపత్రికి వెళ్లగా తెగిపోయిన వేలును తిరిగి అతికించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.