జేసీపై 'మా'కు మాధవీలత కంప్లయింట్
By Knakam Karthik Published on 18 Jan 2025 1:13 PM ISTజేసీపై 'మా'కు మాధవీలత కంప్లయింట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీ లత హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లయింట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం జేసీ, మాధవీలత మధ్య వివాదం నడిచిన విషయం తెలిసిందే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో ఆ ఇష్యూ ముగిసిందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం మాధవీ లత కంప్లయింట్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.
తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేలా దారుణంగా మాట్లాడారని, అసభ్య పదజాలంతో దూషించారని మాధవీ లత అన్నారు. మానవ హక్కుల కమిషన్, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. జేసీ వ్యాఖ్యలను మూవీ ఇండస్ట్రీ ఖండించలేదన్న ఆమె, అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 'మా' ట్రెజరర్ శివ బాలాజీకి ఫోన్ కాల్ చేస్తే స్పందించారని మాధవీలత అన్నారు. తన ఫిర్యాదును మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్తానని శివ బాలాజీ చెప్పినట్లు మాధవీలత పేర్కొన్నారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్న ఆమె, వ్యక్తిత్వ హననం చేయడం కూడా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
మాధవీలత ఫిర్యాదుపై మా ట్రెజరర్ శివ బాలాజీ స్పందించారు. సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై రాజకీయ నాయకులు మాట్లాడడం సరికాదన్న ఆయన, పొలిటికల్ లీడర్లు ఇండస్ట్రీకి జోలి రావొద్దని సూచించారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా ట్రెజరర్ శివ బాలాజీ స్పష్టం చేశారు.