హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో విషాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. మృతుడిని సంజయ్ సావంత్ (58)గా గుర్తించారు... వివరాల్లోకి వెళితే... బుధవారం పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉండటంతో ఎస్సై సంజయ్ మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్‌లోనే నిద్రించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆయనకు ఎన్నికల డ్యూటీ కేటాయించారు.
అయితే, బుధవారం ఉదయం విధులకు బయలుదేరాల్సి ఉండగా, నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న సంజయ్‌ను గమనించిన సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే సంజయ్ మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో గుండెపోటు కారణంగానే చనిపోయి ఉండొచ్చని తెలిపారు. నాచారంలో నివాసముండే సంజయ్ సావంత్ మరణవార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విధి నిర్వహణకు వెళ్లే ముందు అధికారి మృతి చెందడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి సిబ్బంది ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా సంజయ్ సావంత్ 1989 బ్యాచ్ కానిస్టేబుల్ అధికారి. 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు, 2020లో ASIగా పదోన్నతి పొందాడు. 2023లో SIగా పదోన్నతి పొందాడు. పదోన్నతి పొందిన తర్వాత, అతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. అతను 2 సంవత్సరాలుగా LB నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడు.