ఎల్బీనగర్ చౌరస్తా.. ఇకపై శ్రీకాంతాచారి జంక్షన్
LB Nagar Chowrastha has been renamed as Srikantachari Junction. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ
By M.S.R Published on 20 May 2023 11:00 AM GMTహైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుకంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద నిర్మించింది. దీన్ని మున్సిపల్ అండ్ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఎల్బీ నగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి గౌరవార్థం శ్రీకాంతా చారి జంక్షన్ గా నామకరణం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతనంగా నిర్మించిన ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ గా నామకరణం చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంత్ చారి జంక్షన్, ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్ గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన శ్రీకాంతా చారి:
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతచారి. వీరిది సాధారణ కుటుంబం. తండ్రి వెంకటచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేస్తుంటాడు. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం చేస్తున్న దారుణాలను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. తన చావైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు.