నాగోల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

KTR to inaugurate Nagole flyover in Hyderabad Today.నాగోల్ కూడ‌లి వ‌ద్ద నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 4:57 AM GMT
నాగోల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్ వాసుల‌కు శుభ‌వార్త‌. నేటి నుంచి మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రాబోతుంది. నాగోల్ కూడ‌లి వ‌ద్ద నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్ బుధ‌వారం ప్రారంభించ‌నున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో ఎల్బీన‌గ‌ర్ నుంచి ఉప్ప‌ల్ వ‌ర‌కు వాహ‌నాలు సాఫీగా రాక‌పోక‌లు సాగించేందుకు అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది.

స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (SRDP) కార్యక్రమం కింద‌ ఈ ఫ్లై ఓవ‌ర్‌ను నిర్మించారు. 990 మీటర్ల పొడవున ఆరు లేన్లుగా రూ.143.58 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. ఎస్సార్టీపీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 41 ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌గా అందులో ఇప్ప‌టి వ‌ర‌కు 31 పూర్తి అయ్యాయి. ఈ 31 ప్రాజెక్టుల్లో 15 ఫ్లైఓవ‌ర్లు ఉన్నాయ‌ని, ఈరోజు ప్రారంభం కానున్న‌ది 16వ ఫ్లైఓవ‌ర్ అని బ‌ల్దియా అధికారులు తెలిపారు.

ఇప్ప‌టికే కామినేని కూడ‌లి, ఎల్బీన‌గ‌ర్ కూడ‌లి, బైరామ‌ల్ గూడ‌, ఒవైసీ ఆస్ప‌త్రి, చాంద్రాయ‌ణ గుట్ట కూడ‌ళ్ల‌పై నిర్మించిన‌ ఫ్లై ఓవ‌ర్ లు ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. నేడు నాగోలో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుండ‌డంతో.. ఉప్ప‌ల్ నుంచి ఆరాంఘ‌ర్ చౌర‌స్తా వ‌ర‌కు సాఫీగా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని బ‌ల్దియా తెలిపింది.

త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు..

మాదాపూర్‌, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రెండు ఫ్లై ఓవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తోంది. అందులో ఒక‌టి కొత్తగూడ ఫ్లై ఓవర్‌ ఒకటి కాగా మరొకటి శిల్పా లేఅవుట్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి. ఈ రెండు వంతెన ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. శిల్పాలేఅవుట్‌ పైవంతెనను నవంబర్‌లో, కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను డిసెంబర్‌ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story