ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మరింత గడువు కోరిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తనకి ఎన్నికలు కొత్త కాదని , ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకి ఉందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని , తన వైపు నుండి వాదనలు వినిపిస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పధంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని దానం అన్నారు.