రేపు టిమ్స్ భూమిపూజకు హాజరుకానున్న సీఎం కేసీఆర్
KCR to attend TIMS Alwal Bhumi puja tomorrow. అల్వాల్‌లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ
By Medi Samrat Published on 25 April 2022 2:59 AM GMTఅల్వాల్‌లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఏప్రిల్ 26న జరిగే భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొంటారని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం త్వరలో నగర శివార్లలో మూడు కొత్త ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అల్వాల్ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి భూమిపూజ ఏర్పాట్లపై ఆరా తీశారు.
దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న టిమ్స్ అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ ప్రాంతంలోని పట్టణ పేదలకు వరంగా మారనుంది. మల్కాజిగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లోని పట్టణ నివాసాలలో నిరుపేద కుటుంబాలు సాధారణంగా 20-30 పడకల సామర్థ్యం ఉన్న స్థానిక PHCలు, CHCలను సందర్శిస్తారు. చాలా సందర్భాలలో, రోగులను సూపర్-స్పెషలిస్ట్ డాక్టర్‌తో సంప్రదింపుల కోసం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. అయితే.. వెయ్యి పడకల టిమ్స్ అల్వాల్ వస్తే అలా జరగదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి SAM రిజ్వీ, ఇతర సీనియర్ ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.