అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్.. రూ.20 కోట్లు డిమాండ్.. గుండెనొప్పి అంటూ
Karnataka Swamiji kidnap.కర్ణాటకకు చెందిన ఓ స్వామిజీని కిడ్నాప్ చేసి రూ.20కోట్లను డిమాండ్ చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 12:09 PM ISTకర్ణాటకకు చెందిన ఓ స్వామిజీని కిడ్నాప్ చేసి రూ.20కోట్లను డిమాండ్ చేశారు. అయితే.. ఆ స్వామీజీ సిని ఫక్కీలో తనకు గుండెనొప్పి అని చెప్పి ఆస్పత్రిలో చేరి.. విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు కిడ్నాప్ చేసిన వారిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకకు చెందిన అమ్మాజీ అనే స్వామీజీని బార్లీ జిల్లాలోని కపిలాపూర్‌లో దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిరిడీ తీసుకెళ్తామని చెప్పి.. భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి అనే ఇద్దరు తనను హైదరాబాద్ తీసుకొచ్చినట్లు స్వామీజీ తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకెళ్లారని.. అక్కడ ఓ గదిలో బంధించి రూ.20కోట్ల నగదు, కిలో బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు.
నాలుగు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేయడంతో.. చివరకు రూ.5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో.. తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చారని వెల్లడించారు. హైదరాబాద్‌కు చేరుకోగానే తనకు గుండె నొప్పి వస్తోందని.. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని స్వామీజీ కిడ్నాపర్లను కోరారు. ఆస్పత్రిలో చేరిన స్వామీజీ కిడ్నాపర్ల గురించి డాక్టర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లను పట్టుకొని లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు. అయితే.. దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేయకుండానే వదిలేశారని స్వామీజీ ఆరోపించారు. కిడ్నాప్ ఘటనపై స్వామీజీ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని లంగర్‌హౌస్ సీఐ చెప్పారు. కిడ్నాపర్లు తన భక్తులేనని, వారిని వదిలేయాలని స్వామీజీ కోరినట్లు వెల్లడించారు.