డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ల క్లియర్‌కు లంచం..జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐపై వేటు
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరావుపై బదిలీ వేటు పడింది
By - Knakam Karthik |
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ల క్లియర్‌కు లంచం..జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐపై వేటు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరావుపై బదిలీ వేటు పడింది. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ శాఖలో పలువురిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుపై బదిలీ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు క్లియర్ చేసేందుకు లంచాలు తీసుకుంటున్నట్లుగా పలు ఆరోపణలు రావడంతో ఆగ్రహం చెందిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ వెంటనే అతనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే పూర్తిస్థాయిలో విచారణ కొనసాగించిన అనంతరం పలు ఆరోపణలు నిజమని తేలడంతో హైదరాబాద్ సిపి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్సై అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్స్ సుధాకర్లను కూడా బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరూ చలాన్లను మాఫీ చేసేందుకు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లుగా పలు ఫిర్యాదులు అందడంతో ఆగ్రహం చెందిన సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు.
పోలీస్ శాఖలో అవినీతిని ఏమాత్రం సహించబోమని సీపీ సజ్జనర్ స్పష్టం వ్యక్తం చేశారు. ఇటీవల కూడా అవినీతి ఆరోపణలతో ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్ల పై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. విధుల్లో నిర్లక్ష్యం లేదా అవినీతికి పాల్పడితే ఎంతటి అధికారులపైన అయినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.