జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లు
Jubilee Hills Gang Rape Case. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు
By Medi Samrat Published on 30 Sept 2022 6:40 PM ISTహైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు మైనర్ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పును ప్రకటించింది. ఈ కేసులో మొత్తం నిందితులు ఆరుగురు. వారిలో ఐదుగురు మైనర్లు. ఐదుగురు మైనర్లలో ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారు. అయితే నలుగురి మైనర్లను మేజర్లుగా గుర్తించిన బోర్డు... ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం మైనర్‌గానే పేర్కొంది.
రేప్‌కు పాల్పడ్డ వారు మైనర్లు ఎలా అవుతారు.? అత్యాచారం చేసిన మైనర్లను శిక్షించలేమా?.. అంటూ హైదరాబాద్ పోలీసులు ఇటీవలే జువెనైల్ జస్టిస్ బోర్డులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ వీరిని మేజర్లుగా గుర్తించాలని బోర్డును కోరారు. అత్యాచారం సమయంలో బాధితురాలి పట్ల నిందితులు వ్యవహరించిన తీరును బోర్డుకు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణను ముగించిన జువెనైల్ జస్టిస్ బోర్డు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది.
అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురిలో నలుగురిని మేజర్లుగా గుర్తించి కోర్టులో విచారణను మొదలుపెట్టాలని పోలీసులను బోర్డు ఆదేశించింది. మైనర్ అయిన ఎమ్మెల్యే కుమారుడిని జువెనైల్‌గా పరిగణిస్తూ విచారణ చేపట్టవచ్చని తెలిపింది.
మే నెలలో జూబ్లీహిల్స్‌లో ఉన్న పబ్‌లో పార్టీ జరిగిన తర్వాత ఐదుగురు మైనర్లు. మరో యువకుడు కలిసి 17ఏళ్ల బాలికను కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో రాజకీయ నేతల పిల్లలు ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా కీలక ఆధారాలను సేకరించారు.