జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు మొదలయ్యాయి. తొలి రోజే పది మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ మొదటి రోజు తమ నామినేషన్లను సమర్పించలేదు. తొలిరోజు బరిలోకి దిగిన 10 మందిలో ఇద్దరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉండగా, మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ అభ్యర్థిగా అర్వపల్లి శ్రీనివాసరావు తమ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అంతా ప్రశాంత వాతావరణంలో జరుగుతోందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.