రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది
By - Knakam Karthik |
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్, మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది.
నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇందుకోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ, ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండటంతో లెక్కింపును వేగంగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్‌కు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోం ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8:45 గంటలకే తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని, మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తి ఫలితం తేలిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుది పోలింగ్ శాతం 48.49 శాతం
ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గంలో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం తెలిపారు. 2023 సాధారణ ఎన్నికల్లో నమోదైన 47.58 శాతం కంటే ఇది 0.91 శాతం అధికం కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.