జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల ఘ‌ట‌న‌.. మృతుల్లో హైద‌రాబాద్ వాసి

Jaipur Express Attack One of the victims is from nampally in hyderabad. జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

By Medi Samrat  Published on  1 Aug 2023 7:44 PM IST
జైపూర్ ఎక్స్‌ప్రెస్ కాల్పుల ఘ‌ట‌న‌.. మృతుల్లో హైద‌రాబాద్ వాసి

జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైల్వే పోలీసు జరిపిన దర్యాప్తులో మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందినవారని తేలింది. సోషల్ మీడియాలో హైదరాబాద్ ఎంపీ, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందించారు.జైపూర్‌ ట్రైన్‌ కాల్పుల ఘటనలో హైదరాబాదీ మృతి చెందాడని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. జైపూర్‌-ముంబై ట్రైన్‌ కాల్పుల్లో హైదరాబాద్‌ నాంపల్లి బజార్‌ఘాట్‌ చెందిన సయ్యద్‌ సైఫుల్లా మృతి చెందాడు. అతనికి భార్యా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మె‍ల్యే చొరవ చూపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు అసదుద్దీన్ ఓవైసీ.

మహారాష్ట్రలో రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ నలుగురిని కాల్చిచంపిన భయంకరమైన సంఘటనపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ఈ దాడి ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు అసదుద్దీన్. యాంటీ-ముస్లిం హేట్ స్పీచ్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు.

సోమవారం తెల్లవారుజామున 5 గంటల తర్వాత జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ తన తుపాకీతో సీనియర్ RPF సహోద్యోగి, ముగ్గురు ప్రయాణీకులను చంపినట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ చేతన్ సింగ్ (34) ఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ టికా రామ్ మీనా, ప్రయాణికులు అబ్దుల్ ఖాదిర్‌భాయ్ మహమ్మద్ హుస్సేన్ భన్‌పూర్వాలా (48), అక్తర్ అబ్బాస్ అలీ (48), సదర్ మహ్మద్ హుస్సేన్‌లను కాల్చి చంపారు.

జీఆర్పీ కమిషనర్ రవీంద్ర షిశ్వే ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నామని తెలిపారు. వైరల్ వీడియోను కూడా పరిశీలిస్తూ ఉన్నామని అన్నారు. "ఏదైనా నిర్ణయానికి వెళ్లడం చాలా తొందర పాటు అవుతుంది. ఈ దశలో, ఏదైనా వ్యాఖ్యలు చేయడం, వివరాలను పంచుకోవడం సరైనది కాదు," అని రవీంద్ర షిశ్వే చెప్పారు. “రన్నింగ్ ట్రైన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.. ఈ ఘటనపై పోలీసులు వివరంగా దర్యాప్తు చేస్తారని అన్నారాయన.

రాజస్థాన్‌ జైపూర్‌ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్‌(మహారాష్ట్ర) చేరుకున్న టైంలో.. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్‌ అధికారి ఏఎస్సైఐ టికా రామ్‌ మీనా, మరో ముగ్గురు మృతి చెందారు. ఆపై దహిసర్‌ స్టేషన్‌ వద్ద రైలు దూకి చేతన్‌ పారిపోగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story