ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.
By - Medi Samrat |
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరికి అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 'జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్' సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి నగర సీపీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులతో కలిసి చార్మినార్ పరిసరాల్లో సైబర్ క్రైం నివారణ కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చార్మినార్ నుంచి మదీనా వరకు తలపెట్టిన సైబర్ క్రైం అవగాహణ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో సైబర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను సైబర్ నేరరహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ, శనివారాల్లో 'జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్' సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారంలో ఈ రెండు రోజులు ప్రతి ఇంటికి పోలీస్ అధికారులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని ఆయన వివరించారు. అవగాహన లేమితోనే అనేక మంది సైబర్ నేరాల బాధితులవుతున్నారని అన్నారు. ఏ రకమైన సైబర్ మోసం అయినా, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు స్వీయ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.
సైబర్ నేరాల నివారణకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని, స్వచ్చందంగా వలంటీర్లుగా ముందుకు వచ్చే వారు సైబర్ సింబాలుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచింంచారు. ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింబా తయారై తన కుటుంబాన్ని, సమాజాన్ని సైబర్ మోసాల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఫోటోలు, వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని, అలా చేస్తే ట్రాప్ చేసి మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని, ముఖ్యంగా ఆడపిల్లలు అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్ చేసి వ్యక్తిగత వివరాలు సమర్పించుకొని బాధితులు అవుతున్నారని చెప్పారు.
ఆడ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, వారికి ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాల పట్ల వారి పిల్లలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్ప్ లైన్ నంబర్ 1930 కి చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే, జాతీయ సైబర్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ చాలా కీలకమని, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టవచ్చని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్, యాప్ లను నమ్మవద్దని, ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.