హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం ఘనంగ జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లు హాజరయ్యారు. నూతన వధూవరులను కేసీఆర్, వైఎస్ జగన్‌లు అశీర్వదించారు. వధూవరులతో కలిసి కేసీఆర్, జగన్‌లు ఫొటోలు దిగారు. వివాహ వేడుకలో కేసీఆర్, వైఎస్ జగన్‌లు పక్క పక్కనే కూర్చున్నారు. అదే సమయంలో వారు కాసేపు ముచ్చటించుకున్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదం తర్వాత తొలిసారిగా కేసీఆర్, జగన్‌లు కలుసుకున్నారు.
అయితే పెళ్లి వేడుకలో వారు ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాస్తా ఆసక్తిగా మారింది. ఈ వివాహ వేడుకలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, నాయకులు కూడా హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జలవివాదంపై రగడ చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ మంత్రులు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.