రాజాసింగ్‌కు భద్రత పెంచిన అధికారులు
Increased security for Rajasingh. ఇటీవల గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా
By Medi Samrat Published on 2 Sept 2022 8:15 PM IST
ఇటీవల గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ భద్రతను మరింతగా పెంచారు అధికారులు. రాజాసింగ్ ను మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్ లోకి మార్చారు. రాజాసింగ్ కోసం ములాఖత్ కోసం వస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు.
మునావర్ ఫారూఖీ అనే స్టాండప్ కమెడియన్ గతంలో హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవతలపై అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని క్షమించేది లేదని హిందూ సంఘాలు మండిపడ్డాయి. అలాంటిది అతడి షోను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ షోను అడ్డుకుని తీరతామని.. మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహిస్తే ఊరుకునేది లేదని రాజా సింగ్ హెచ్చరించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య షోను నిర్వహించగా.. రాజా సింగ్ ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఓ వివాదాస్పదమైన వీడియోను అప్లోడ్ చేశాడు. అందులో మునావర్ ను.. అతడి కుటుంబాన్ని తీవ్రమైన పదజాలంతో విమర్శించాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయింది. బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాజాసింగ్ ను ఆగస్టు 23న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కూడా..! ఆ తర్వాత పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు.